Pawan Kalyan: ఆ టైమ్‌లో జగన్‌ బెంగళూరు అవినీతి లెక్కల్లో ఉండేవాడు: పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan Slams CM Jagan: తాను కులాల గురించి ఎప్పుడు మాట్లాడినా.. విద్వేషాలు నింపేలా మాట్లాడనని అన్నారు పవన్ కళ్యాణ్. జగన్ అవినీతి గురించి ఎంత మాట్లాడినా ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ఎవరు తినడం లేదని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారని అన్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Dec 2, 2023, 07:34 PM IST
Pawan Kalyan: ఆ టైమ్‌లో జగన్‌ బెంగళూరు అవినీతి లెక్కల్లో ఉండేవాడు: పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan Slams CM Jagan: సమాజంలో అణగారిన, వెనకబడిన వర్గాలకు నిర్ణయాత్మక అధికారం కావాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వారి వారి కులాలకు సంబంధించి అభివృద్ధి వైపు నడిపించే నిజమైన అధికారం వారికి చెందాలన్నదే జనసేన పార్టీ ఆకాంక్ష అని చెప్పారు. ఇప్పటి వరకు అధికారం చూడని కులాలకు నిజమైన అధికారం దక్కాలని అన్నారు. ఆయా వర్గాలు వారిని వారు అభివృద్ధి చేసుకునేందుకు దారి చూపాలన్నదే జనసేన అసలు సిద్ధాంతమన్నారు. తాను ప్రతి సభలోనూ కులాల గురించి మాట్లాడతానని వైసీపీ నాయకులు అంటారని.. 80 శాతం నామినేటెడ్‌ పోస్టులను, ఇతర పదవులను ఒకే కులానికి కట్టబెట్టిన వైసీపీకి అసలు కులాల గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదని గుర్తించుకోవాలన్నారు. శనివారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇతర పార్టీల కీలక నేతలు జనసేనలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు పవన్. 

"నేను కులాల గురించి ఎప్పుడు మాట్లాడినా విద్వేషాలు నింపేలా మాట్లాడను. ఆయా కులాల సాధికారత, అభివృద్ధి ఎలా జరగాలి అన్నదానిపైనే నిజాలు మాట్లాడతాను. భారతదేశం కులాల సమూహం. కులాల గురించి, ఆయా సామాజిక వర్గాల అసలు స్థితిని చెప్పకపోతే ఎలా..? 2008లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించక ముందే 2004 నుంచి కూడా నేను దళిత, బీసీ సంఘాల నాయకులతో ఎన్నో విషయాలపై సుదీర్దంగా చర్చించాను. అధికారం లేని వారికి ఎలాంటి సాధికారత కావాలి.. నిర్ణయాత్మక శక్తి ఎలా ఇవ్వాలి అన్న దానిపై చర్చించాను. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లలో నిధులు, అధికారం లేకపోతే ఆయా వర్గాలకు నిజమైన అభివృద్ధి ఎలా దక్కుతుంది..? అది నిజమైన సాధికారత ఎలా అవుతుంది..? 

ప్రతిసారి నేను జగన్‌ అవినీతి గురించి ఎంత మాట్లాడినా.. ప్రజలు దాన్ని పెద్ద సీరియస్‌ విషయంగా తీసుకోవడం లేదు. ఈ రోజుల్లో ఎవరు తినడం లేదంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. నేను ఇవన్నీ క్షుణ్ణంగా గమనించే జగన్‌ అవినీతి మీద మాట్లాడటం మానేశాను. ప్రజలకు నష్టం చేకూరుస్తున్న అంశాలు, ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడాల్సిన అవసరం ఉంది. సమాజంలో జరుగుతున్న కోట్ల రూపాయల అవినీతి తతంగం ఎవరికీ పట్టడం లేదు. అవినీతి విషయంలో సగటు మనిషి ఆలోచన తీరు మారిపోయింది. 

దీనిపై వారిలోనే మార్పు రావాలి. అవినీతి గురించి సీరియస్‌గా ప్రజలు ఆలోచించి ఉంటే జగన్‌ అసలు అధికారంలోకి వచ్చే వాడే కాదు. జగన్‌ దోపిడీ మీద కూడా కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేద్దామని ఆలోచిస్తే వారికి ఈ విషయం తెలీదా..? అనే సందేహం నాకు కలుగుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 2004లో ఎన్నికల్లో నిలబడటానికి డబ్బు లేని పరిస్థితి నుంచి అధికారం వచ్చిన తరువాత సాక్షి లాంటి పత్రికలు నడిపే స్థాయికి వచ్చారంటే ఏం జరిగిందో ఈజీగా అర్థమవుతుంది. నేను బీసీలు, ఎస్సీల గురించి ఆలోచించే సమయంలో జగన్‌ బెంగళూరు అవినీతి లెక్కల్లో ఉండేవాడు. రూ.30 వేల కోట్లు, రూ.40 వేల కోట్లు వీరికి చాలా చిన్న విషయం." అని జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్‌ అన్నారు. 

దోచుకున్న ఇన్ని వేల కోట్లు సరిపోక మరింత కూడబెట్టడానికి కల్తీ మద్యం రూపంలో ప్రజల ప్రాణాలు తీసి సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఇసుకను దోచేస్తూ ఆర్జిస్తున్నారని అన్నారు. వైసీపీ చేస్తున్న అన్యాయాలను ఎవరైనా అడిగితే, ప్రశ్నిస్తే బెదిరించడం ప్రాణాలు తీయడం చాలా సులభం అయిపోయిందని మండిపడ్డారు. ఇంతడబ్బు సరిపోక ప్రజల నుంచి దౌర్జన్యంగా లాక్కోవడమే లక్ష్యంగా జగన్‌ పాలన చేస్తున్నారని విమర్శించారు. జగన్‌ అవినీతి గురించి ప్రజలు ఆలోచించడం మానేసి చాలా రోజులైందని.. వారికి కావాల్సిన రోడ్లు, పన్నులు, మైనింగ్‌ దోపిడీ, దౌర్జన్యాలు, బెదిరింపులు మీద చైతన్యవంతం చేస్తూ పోరాడాల్సిన అవసరం ఉందని సూచించారు.

Also Read:  Michaung Cyclone: తుపాను ప్రభావం తీవ్రమే, అతి భారీ వర్షాల హెచ్చరిక, ప్రభుత్వం అలర్ట్

Also Read:  Diabetic Care in Winter: శీతాకాలంలో మధుమేహం వ్యాధిగ్రస్థులకు తస్మాత్ జాగ్రత్త

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News