కేంద్రానికి ఎందుకు శిస్తు చెల్లించాలి ? : కేంద్రంపై చంద్రబాబు తిరుగుబాటు !

కేంద్రానికి శిస్తు ఎందుకు చెల్లించాలి ? : చంద్రబాబు నాయుడు

Last Updated : May 29, 2018, 06:42 PM IST
కేంద్రానికి ఎందుకు శిస్తు చెల్లించాలి ? : కేంద్రంపై చంద్రబాబు తిరుగుబాటు !

రాష్ట్రాభివృద్ధికి నిధులు మంజూరు చేయని కేంద్ర ప్రభుత్వానికి పన్నులు మాత్రం ఎందుకు చెల్లించాలి అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ముఖ్యంగా నూతన రాజధాని కోసం నిధులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పన్నులు చెల్లించాల్సిన అవసరం ఏముంది అని చంద్రబాబు అసహనం వ్యక్తంచేశారు. ప్రపంచ స్థాయి రాజధాని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడటం కేంద్రానికి ససేమిరా ఇష్టం లేదు. అందుకే అమరావతి అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు అని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. టీడీపీ మహానాడులో భాగంగా మూడవ రోజు జరిగిన ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందినట్టయితే, ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, వస్తు, సేవల పన్ను రూపంలో కేంద్రానికి భారీ మొత్తంలో ఆదాయం అందుతుంది కానీ అమరావతిని అభివృద్ధి చేయడం కేంద్రానికి ఇష్టం లేదు అని చెబుతూ ఆంధ్రాకు మాత్రం ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి రాజధాని అవసరం లేదా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. 

ఆంధ్రప్రదేశ్‌ని కేంద్రం ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తోంది అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పిన చంద్రబాబు నాయుడు.. ఓవైపు గుజరాత్‌లో ధోలెరా స్మార్ట్ సిటీ అభివృద్ధికి రూ.95,000 కోట్లు కేటాయించిన బీజేపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేస్తోంది అని దుయ్యబట్టారు. ధోలెరా స్మార్ట్ సిటీ ఢిల్లీకి నాలుగు రెట్లు పెద్దది, షాంఘైకి ఏడు రెట్లు గొప్పది అని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లో రెండో రాజధాని వంటి నగరం కోసమే అంత శ్రద్ధ కనబరుస్తున్నప్పుడు ఆంధ్రాకు ఒక్క రాజధాని కూడా వుండకూడదా అని మహానాడు వేదికపై నుంచే చంద్రబాబు నాయుడు కేంద్రానికి పలు విమర్శలు ఎక్కుపెట్టారు. 

Trending News