బాలీవుడ్ మల్టీస్టారర్ చిత్రంలో ప్రభాస్..!

బాలీవుడ్‌లో బాహుబలికి లభించిన ఆదరణతో ఆయన అక్కడి ప్రేక్షకులకూ బాగా దగ్గరయ్యారు.

Last Updated : Jul 29, 2018, 02:22 PM IST
బాలీవుడ్ మల్టీస్టారర్ చిత్రంలో ప్రభాస్..!

బాహుబలి సినిమాలు రెండూ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాక ప్రభాస్ స్టార్‌డమ్ బాగా పెరిగింది. బాలీవుడ్‌లో బాహుబలికి లభించిన ఆదరణతో ఆయన అక్కడి ప్రేక్షకులకూ బాగా దగ్గరయ్యారు. ఆ సమయంలోనే ప్రభాస్‌కు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. దర్శకుడు కరణ్ జోహార్ స్వయంగా ప్రభాస్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. కానీ కొన్ని కారణాల వల్ల ప్రభాస్ బాలీవుడ్‌కు నో చెబుతూ వచ్చారు. అయినా బాలీవుడ్ నిర్మాతలు మాత్రం ప్రభాస్‌తో నేరుగా హిందీ చిత్రం నిర్మించేందుకు ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. ప్రభాస్‌ ప్రస్తుతం సాహో చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుజీత్ ద‌ర్శక‌త్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీతో సహా ఇతర భాషల్లో అనువదించే విధంగా నిర్మిస్తున్నారు.  

ఇదిలా ఉండగా ప్రభాస్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారని గత కొద్ది రోజులుగా బీ టౌన్‌లో వినిపిస్తోంది. బాలీవుడ్ సినిమాలను హిందీలో విడుదల చేసిన కరణ్ జోహారే ప్రభాస్‌ను బాలీవుడ్‌లో పరిచయం చేసే బాధ్యతలను తీసుకున్నారని తెలిసింది. ప్రభాస్ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నారని.. ఇందులో మరో హీరోగా రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నారని..ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌ నిర్మిస్తారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్‌, రణ్‌వీర్‌ సింగ్ ఇద్దరూ కూడా.. కమిట్‌ అయిన ప్రాజెక్ట్స్‌‌తో బిజీగా ఉండటంతో.. ఈ ఏడాది చివరి నాటికి లేదా 2019లో ఈ మల్టీస్టారర్‌ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుందట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. దీనిపై ప్రభాస్‌ నుండి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు.

Trending News