సమ్మర్ స్పెషల్: హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

సమ్మర్ స్పెషల్: హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

Last Updated : Feb 24, 2019, 02:21 PM IST
సమ్మర్ స్పెషల్: హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: వేసవి సెలవులు వస్తున్నాయంటే, వివిధ పర్యాటక ప్రాంతాలు, సొంత ఊర్లకు వెళ్లి ఎంజాయ్ చేసొద్దాం అనుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే ఓ శుభవార్త వెల్లడించింది. వేసవిలో వివిధ మార్గాల్లో పెరగనున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారి సౌకర్యం కోసం హైదరాబాద్-సికింద్రాబాద్-కాచిగూడ స్టేషన్ల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 445 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టంచేసింది. మార్చి మొదటి వారం నుంచి జులై మొదటి వారం వరకు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించనున్న సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ వివరాలను దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ మీడియాకు వెల్లడించారు.

సికింద్రాబాద్‌ - కమాఖ్య - సికింద్రాబాద్‌ రైలు ( 07149/07150): మార్చి 1వ తేదీ నుంచి జూన్‌ 28వ తేదీ వరకు వయా నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌, జల్పాయ్‌గుడి మీదుగా మొత్తం 36 సర్వీసులు అందించనుంది.
హైదరాబాద్‌ - జయపుర - హైదరాబాద్‌ రైలు ( 02731/02732): మార్చి 1వ తేదీ  నుంచి జూన్‌ 30వ తేదీ వరకు వయా నిజామాబాద్‌, నాందేడ్‌, అజ్మేర్‌ మీదుగా మొత్తం 36 సర్వీసులు అందించనుంది.
సికింద్రాబాద్‌ - దర్భంగ - సికింద్రాబాద్‌ రైలు (07007/07008) రైలు: మార్చి 2వ తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు మొత్తం 70 సర్వీసులు అందించనుంది.
సికింద్రాబాద్‌ – బరౌని రైలు (07009/07010) : మార్చి 3వ తేదీ నుంచి జూన్‌ 30వ తేదీ వరకు ప్రతీ ఆదివారం రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి ఆ తర్వాతి రోజు ఉదయం 11.40 గంటలకు బరౌనికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి బుధవారం ఉదయం 7.10 గంటలకు బరౌని నుంచి బయలుదేరి ఆ తర్వాతి రోజు రాత్రి 10.40 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.
సికింద్రాబాద్‌ - రాక్సల్‌ - సికింద్రాబాద్‌ రైలు (07091/07092): మార్చి 5వ తేదీ నుంచి జూన్‌ 28వ తేదీ వరకు వయా కాజీపేట, మంచిర్యాల, నాగ్‌పుర్‌, పాట్నా మీదుగా రాకపోకలు సాగించనుంది.
హైదరాబాద్‌ - రాక్సల్‌ - హైదరాబాద్‌ రైలు (07005/07006): మార్చి 7వ తేదీ నుంచి జూన్‌ 30వ తేదీ వరకు వయా కాజీపేట, మంచిర్యాల, నాగ్‌పూర్‌, గయ, దర్భంగ మీదుగా రాకపోకలు సాగించనుంది.
హెచ్‌ఎస్‌ నాందేడ్‌ - హజ్రత్‌ నిజాముద్దీన్‌ -హెచ్‌ఎస్‌ నాందేడ్‌ రైలు (02485/02486): మార్చి 7వ తేదీ నుంచి జూన్‌ 29వ తేదీ వరకు రాకపోకలు సాగించనుంది.
కాచిగూడ – కృష్ణరాజపురం రైలు (07603/07604): మార్చి నుంచి జూలై వరకు ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి ఆ తర్వాతి రోజు ఉదయం 6 గంటలకు కృష్ణరాజపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి సోమవారం మధ్యాహ్నం తర్వాత 3.25 గంటలకు బయల్దేరి ఆ తర్వాతి రోజు ఉదయం 6.55 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
కాచిగూడ – కాకినాడ రైలు (07425/07426): జూన్‌లో ప్రతి శుక్రవారం సాయంత్రం 6.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.10 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

Trending News