Bandi Sanjay: బండి సంజయ్‌కి హైకోర్టు బెయిల్.. జైలు నుంచి విడుదలకు ఆదేశాలు

HC orders to release Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి హైకోర్టులో ఊరట లభించింది. సంజయ్‌కి విధించిన 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీపై న్యాయస్థానం స్టే విధించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2022, 04:55 PM IST
  • బండి సంజయ్ విడుదలకు హైకోర్టు ఆదేశాలు
  • రిమాండ్‌పై స్టే, బెయిల్ మంజూరు చేసిన కోర్టు
  • పోలీసుల తీరును తప్పు పట్టిన న్యాయస్థానం
 Bandi Sanjay: బండి సంజయ్‌కి హైకోర్టు బెయిల్.. జైలు నుంచి విడుదలకు ఆదేశాలు

HC orders to release Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి హైకోర్టులో ఊరట లభించింది. సంజయ్‌కి విధించిన 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీపై న్యాయస్థానం స్టే విధించింది. రూ.40వేల పూచీకత్తుపై సంజయ్‌కి బెయిల్ మంజూరు చేస్తూ (Bandi Sanjay gets Bail) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బండి సంజయ్‌ని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. సంజయ్ అరెస్టు, రిమాండును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం (జనవరి 5) విచారణ చేపట్టింది.

బండి సంజయ్ తరుపున న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. సంజయ్‌పై ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు నమోదు చేసిందని ఆరోపించారు. చట్ట ప్రకారం 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడం సరైంది కాదన్నారు. దేశాయ్ వాదనలు విన్న కోర్టు.. సంజయ్‌ని రాత్రి 10.50గం. సమయంలో అరెస్ట్ చేస్తే 11.05నిమిషాలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని... అంత త్వరగా ఎఫ్ఐఆర్ ఎలా సాధ్యమైందని పోలీసులను ప్రశ్నించింది.

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో రిమాండ్‌కు ఆదేశాలివ్వడాన్ని కోర్టు తప్పు పట్టింది. ఎఫ్ఐఆర్‌లో సెక్షన్ 333 అదనంగా ఎందుకు చేర్చారని ప్రశ్నించింది. సంజయ్‌‌కి బెయిల్ మంజూరు చేస్తూ తక్షణమే ఆయన్ను విడుదల చేయాలని జైళ్ల శాఖను ఆదేశించింది.

ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ జైల్లో రిమాండులో ఉన్న సంగతి తెలిసిందే. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో.317ని సవరించాలంటూ ఆదివారం (జనవరి 2) సంజయ్ జాగరణ దీక్షకు సిద్ధపడ్డారు. ఇంతలో దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయన కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఘర్షణ, తోపులాట జరిగింది. ఉద్రిక్తతల నడుమ సంజయ్‌ని అక్కడి నుంచి తరలించగా... మరుసటిరోజు కరీంనగర్ కోర్టు ఆయనకు 15 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సంజయ్‌ని పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు.

మరోవైపు సంజయ్ అరెస్టును నిరసిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఆధ్వర్యంలో బీజేపీ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. సంజయ్ అరెస్టును నిరసిస్తూ ఇప్పటికే బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. సంజయ్ అరెస్ట్ విషయంలో ప్రభుత్వం అతిగా వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Chiranjeevi Review: సేనాపతి సినిమాపై మెగాస్టార్ చిరంజీవి సూపర్ రివ్యూ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News