సొంత నాన్నమ్మను గన్‌తో షూట్ చేసిన 11 ఏళ్ల బాలుడు..!

   

Last Updated : Nov 5, 2018, 04:23 PM IST
సొంత నాన్నమ్మను గన్‌తో షూట్ చేసిన 11 ఏళ్ల బాలుడు..!

అమెరికాలో ఈ మధ్యకాలంలో పసిపిల్లలు నేరాలకు పాల్పడడం ఎక్కువవుతోంది. కొందరు బాలలు విపరీతమైన నేర ప్రవర్తనకు అలవాటుపడడం వల్ల అనుకోని దారుణాలకు పాల్పడుతున్నారు. పాఠశాలల్లో కౌన్సిలింగ్ సెంటర్లు నెలకొల్పినా.. పిల్లలకు మంచి, చెడూ చెప్పడానికి స్పెషల్ ట్రైనర్స్‌ని రిక్రూట్ చేసుకున్నా కూడా.. ఈ నేరాల సంఖ్య పెరుగుతుందే గానీ తగ్గడం లేదు. కొందరు పిల్లలు పసిప్రాయంలోనే వివిధ కారణాల వల్ల హింసకు ప్రేరేపితులవుతున్నారు. అందులో ఆనందాన్ని పొందుతున్నారు.

సినిమాలు, టీవీ షోల ప్రభావం.. అంతకు మించి అంతర్జాలంలో వారికి లభ్యమవుతున్న క్రైం లిటరేచర్ మొదలైనవి పిల్లలకు చెడు సందేశాన్ని అందిస్తున్నాయని పలువురు పరిశోధకులు చెప్పడం గమనార్హం. పిల్లలు స్వతంత్ర ఆలోచనలను పెంపొందించుకొనే సందర్భంలో వారిని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో.. అవే వారి జీవితాన్ని మలుపు తిప్పుతాయని కూడా కొందరు వ్యక్తిత్వ వికాసనిపుణులు చెబుతున్నారు. ఇటీవలే అమెరికాలో జరిగిన ఓ ఘటన అందుకు అద్దం పడుతుంది. 

ఓ 11 ఏళ్ల బాలుడు తనను ఇల్లు శుభ్రం చేయమందన్న ఒకే ఒకే కారణంతో తన నానమ్మ పై తూటాల వర్షం కురిపించాడు. గత కొంతకాలంగా తన తాతయ్య వాడే గన్‌‌తో ఎవరికీ తెలియకుండా.. ప్రాక్టీసు చేసిన సదరు బాలుడు ఆఖరికి ఓ రోజు అదే గన్‌తో తన సొంత నానమ్మను కాల్చేశాడు. 65 సంవత్సరాల నానమ్మ ప్రతీ రోజు ఇల్లు తుడవమని సతాయించడంతో.. ఆమె పీడ నుండి ఎలాగైనా బయటపడాలని భావించే ఈ పని చేశానని ఆ బాలుడు చెప్పడం గమనార్హం.  బాలుడు ఆ నేరానికి పాల్పడుతున్నప్పుడు అతని తాతయ్య ఇంటి వసారాలో ఉన్నారు. తూటాల శబ్దం వినగానే ఇంట్లోకి వెళ్లిన ఆయనకు తన భార్య రక్తపు మడుగులో కనిపించింది. తర్వాత గన్‌తో తన మనవడు కనిపించాడు. తాతయ్య తనను చూడగానే సదరు బాలుడు గన్‌ను వదిలిపెట్టి బయటకు ఉడాయించాడు. ప్రస్తుతం పోలీసులు ఆ బాలుడిని వెతుకుతున్నారు. 

Trending News